Breaking News


Tuesday 24 December 2013

Is it Political suicide by AAP?



రాజకీయాల్లో మార్పు తీసుకొస్తామని, చెత్తనంతా ఊడ్చిపారేస్తామని, అవినీతిని సమూలంగా నిర్మూలిస్తామంటూ కొత్తగా వచ్చిన 'ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. తన రాజకీయ భవిష్యత్తును అంధకారంలో పడేసుకుంది. ఢిల్లీలో ఏ పార్టీనైతే ప్రజలు ఇంటికి పంపించారో.. ఇప్పుడు అదే పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధం కావడంతో సామాన్యుడి పార్టీ కాస్తా అసలు సిసలు రాజకీయ పార్టీగా రూపుదిద్దుకున్నట్టయింది. గత 15 ఏళ్ల పాలనలో జరిగిన అవకతవకలపై విచారణ చేయిస్తానంటూ డాంభికాలు పలికిన పార్టీ ఇప్పుడు అదే పార్టీ చేతిలో ఇమిడిపోయింది. తమకు మద్దతిచ్చే పార్టీపై విచారణ జరిపించడమంటే అది ఎలా జరుగుతుంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో నూతన అధ్యాయానికి తెరతీస్తామంటూ వచ్చిన ఆప్ కన్వీనర్, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ సైతం అధికార పీఠానికి దాసుడైపోవడం నిజంగా విచారకరమైన అంశం.

ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టి, తర్వాతి స్తానంలో ఆప్ ను ఆదరించారు. 15 ఏళ్లుగా అధికారం చలాయించిన కాంగ్రెస్ ను ఇంటికి సాగనంపారు. 70 సీట్లు గల ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికారం చేపట్టాలంటే 36 సీట్లు కావాలి. అయితే బీజేపీ 31 స్థానాలు గెలిచి పెద్ద పార్టీగా అవతరించగా, 28 సీట్లతో ఆప్ రెండో స్థానంలో నిలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ 8 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో సర్కారు ఏర్పాటు చేయాలంటే ఏవో రెండు పార్టీలు కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ తమకు సరిపడా సీట్లు రానందున సర్కారు ఏర్పాటు చేయలేమని బీజేపీ ప్రకటించింది. ఆప్ కూడా ప్రతిపక్షంలో కూర్చుంటామని పేర్కొంది. మరోవైపు ఆప్ కు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు సంసిద్దత వ్యక్తంచేసినా, తాము ఎవరి మద్దతూ తీసుకునే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ స్పష్టంచేశారు.

అయితే రెండు వారాలు తిరిగేసరికి సీన్ మారిపోయింది. చేతి వరకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అనుకున్నారో ఏమో.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని కేజ్రీవాల్  ప్రకటించారు. ఇందుకు ప్రజల అభిప్రాయం అనే ముసుగు తగిలించారు. ఈ అంశంపై నిర్వహించిన ఎస్సెమ్మెస్ పోల్ లో 74 శాతం మంది కాంగ్రెస్ తో కలవాలని కోరుకున్నారని ఆప్ వెల్లడించింది. ఇక్కడే అసలు సిసలు లాజిక్ మిస్ అయ్యారు. వాస్తవానికి ఢిల్లీ ప్రజలు ఆప్ కంటే బీజేపీ వైపే మొగ్గు చూపారు. అందుకే ఆ పార్టీకి 31 సీట్లు వచ్చాయి. ఇక రెండో అవకాశం ఆప్ కు ఇచ్చారు. కాంగ్రెస్ తమకు వద్దని తేల్చిచెప్పారు. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి రాలేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీ మద్దతుతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం నైతికం అనిపించుకుంటుంది. కానీ ప్రజలు వద్దన్న పార్టీతో జట్టు కట్టాలని ఆప్ తీసుకున్న నిర్ణయం వెనుక ఆంతర్యమేంటో అర్థం కాని ప్రశ్నలా మిగిలిపోయింది.

ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం వచ్చినా, తాము ప్రతిపక్షంలోనే ఉంటామని కేజ్రీవాల్ ప్రకటించడంతో ఆయన ఒక్కసారిగా హీరో అయిపోయారు. ఇన్నాళ్లకు సరికొత్త రాజకీయ నేత వచ్చాడని దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మీడియా సైతం కేజ్రీవాల్ ను ఆకాశానికెత్తేసింది. అయితే అనూహ్యంగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవడం చూస్తే, ఎంతవారలైనా.. అనే  సామెత గుర్తొస్తోంది. అధికారం దగ్గరకొచ్చేసరికి ఎవరైనా ఒక్కటే అనే సత్యం మళ్లీ బోధపడింది. అధికారం కోసం కాంగ్రెస్ తో అంటకాగడానికి సిద్ధమైన కేజ్రీవాల్ తన నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటారో, ఆయన చర్యను ఢిల్లీ ప్రజలు ఎలా స్వీకరిస్తారో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తేలనుంది.

Share This
Blogger
Facebook
Disqus

comments powered by Disqus

No comments:

Post a Comment

Subscribe
Labels
Popular Posts

Subscribe Via Email

About Us

Advertisment

>
© telugutrendz.com All rights reserved | Designed By Seo Blogger Templates