
తెలుగు సినీ పరిశ్రమకు 2013 చేదు అనుభవాన్నే మిగిల్చింది. ప్రథమార్థం కాస్త బాగానే ఉన్నప్పటికీ ద్వితీయార్థం మాత్రం ఘోర పరాజయాలను చవిచూసింది. మగధీర రికార్డులు తడిచిపెట్టిన అత్తారింటికి దారేది వంటి భారీ హిట్ వచ్చినప్పటికీ, పలువురు పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఈ ఏడాది దాదాపు రూ.300 కోట్ల మేర తెలుగు పరిశ్రమ నష్టపోయింది.
రామ్ చరణ్ కు ఈ ఏడాది మాత్రం పీడకలే. ప్రథమార్థంలో వచ్చిన నాయక్.. హిట్ టాక్ తెచ్చుకుని రూ.40 కోట్లు కొల్లగొట్టినా, ఆ తర్వాత వచ్చిన తుఫాన్ ఘోరమైన ప్లాప్ అయింది. బాలీవుడ్ లో జంజీర్ తో తెరంగాట్రం చేసిన చరణ్ కు అక్కడ చేదు అనుభవమే ఎదురైంది. తొలిరోజునే జంజీర్ ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇక ఆ సినిమాకు తెలుగు వెర్షన్ గా వచ్చిన తుఫాన్ కు కూడా ఇక్కడ ఆదరణ లభించలేదు. దాదాపు రూ.60 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. కనీసం రూ.20 కోట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. ఇక సినిమా మొత్తం పూర్తయిన ఎవడు.. విడుదలకు నోచుకోకపోవడం చరణ్ కు మరో దెబ్బ. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కు కూడా 2013 కలిసి రాలేదు. పూరీ జగన్నాథ్, బన్నీ కాంబినేషన్ లో రూ.40 కోట్లతో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో బాక్సాఫీసు వద్ద చతికలపడింది. జూనియర్ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందిన బాద్ షా ఆశించిన మేరకు అంచనాలను అందుకోలేకపోయింది. అనంతరం గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన రామయ్యా.. వస్తావయ్యా అట్టర్ ప్లాప్ కావడం ఎన్టీఆర్ కు తీరని వ్యధ మిగిల్చింది.
ఇక కెరీర్ చరమాంకంలో ఉన్న వెంకటేష్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన షాడో ఎంత దారుణమైన ప్లాప్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తర్వాత వచ్చిన మసాలా సినిమా కూడా బోల్తా కొట్టింది. ఇక కల్యాణ్ రామ్ నటించి నిర్మించిన ఓం సినిమా దారుణంగా ప్లాప్ అయ్యింది. గ్రాఫిక్స్ కోసం భారీగానే ఖర్చు చేసినప్పటికీ సరైన కథ, కథనం లేకపోవడంతో ఆ సినిమా ప్లాప్ జాబితాలో చేరిపోయి నిర్మాతకు నష్టాన్నే మిగిల్చింది. ఇక రామ్ ఎందుకంటే ప్రేమంటే, ఒంగోలు గిత్తలు ఘోరంగా ప్లాపయ్యాయి.
No comments:
Post a Comment