Breaking News


Tuesday 10 December 2013

Delhi headed for repoll?



ఢిల్లీలో రాజకీయ అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు సంక్లిష్టంగా మారింది. ఆదివారం వెలువడిన ఫలితాల్లో బీజేపీ 32 సీట్లు దక్కించుకుని అతిపెద్ద పార్టీకి అవతరించగా, కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాలు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ 8 సీట్లకే పరిమితమైంది. ఇతరులు రెండు స్థానాలు గెలుచుకున్నారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 36 మంది సభ్యుల మద్దతు కావాలి. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఆ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ఇంకా నలుగురు సభ్యలు మద్దతు అవసరం. కానీ స్వతంత్ర సభ్యులు అంతమంది లేరు. గెలుపొందిన ఇతరుల్లో ఒకరు జేడీయూ అభ్యర్థి కాగా, మరొకరు ఇండిపెండెంట్. జేడీయూ ఎమ్మెల్యే తాను బీజేపీకి మద్దతివ్వబోనని, ఆప్ కు అయితే బేషరతుగా మద్దతిస్తానని ప్రకటించారు. ఇక స్వతంత్ర ఎమ్మెల్యే తనకు డిప్యూటీ సీఎం పదవినిస్తే బీజేపీకి మద్దతిస్తానని పేర్కొన్నారు. అయితే బీజేపీ కానీ, ఆప్ కానీ ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖంగా లేవు. అనైతిక పద్దతిలో తాము ఎమ్మెల్యలేను ఆకర్షించబోమని, అవసరమైతే ప్రతిపక్షంలోనే కూర్చుంటామని బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు. మరోవైపు ఆప్ కూడా తాము విపక్షంలోనే కూర్చుంటామని చెబుతోంది. ఆప్ కు మద్దతివ్వడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ అందుకు అంగీకరించడంలేదు. ప్రజలు తమకు పూర్తి స్థాయి మెజరిటీ ఇవ్వనందున సర్కారు ను ఏర్పాటు చేయబోమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ పాలన తెర పైకి వస్తోంది. అసెంబ్లీని రద్దు చేయడం లేదా సుప్తచేతనవాస్థలో ఉంచి, గవర్నర్ పాలన విధించడం ఒక్కటే కేంద్రం ముందున్న మార్గం. గవర్నర్ పాలన కూడా ఆరు నెలలకు మించి విధించడానికి వీలు లేదు. అంటే మళ్లీ ఆరు నెలల్లోగా ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరపాల్సిందే. అంటే, లోక్ సభ ఎన్నికలతోపాటే వీటిని జరిపే అవకాశం ఉంది.


Share This
Blogger
Facebook
Disqus

comments powered by Disqus

No comments:

Post a Comment

Subscribe
Labels
Popular Posts

Subscribe Via Email

About Us

Advertisment

>
© telugutrendz.com All rights reserved | Designed By Seo Blogger Templates