
రాష్ట్ర విభజన అంశంలో మరో ప్రధాన ఘట్టానికి తెర లేచింది. ఆంధ్ర్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు, 2013 రాష్ట్రానికి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును సరిహద్దు భద్రతా దళా(బీఎస్ఎఫ్)నికి ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి తీసుకొచ్చింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సురేష్ కుమార్ స్వయంగా తీసుకొచ్చి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి అందజేశారు. బిల్లును ఢిల్లీలోనే 400 కాపీలు జిరాక్స్ తీసి, వాటిని తొమ్మిది కట్టల్లో సీల్ చేసి మరీ తీసుకొచ్చారు. తొలుత మహంతికి ఆ ప్రతులను అందజేసిన సురేష్ కుమార్.. తర్వాత గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలతో వేర్వేరుగా భేటీ అయ్యి వారికి బిల్లును అందజేశారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు కూడా బిల్లు ఇద్దామని వెళ్లగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంకు ఇచ్చి వెళ్లిపోయారు. ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చించి, మొత్తం అభిప్రాయాలతో జనవరి 23లోగా తిప్పి పంపాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోరారు. మరోవైపు తెలంగాణ బిల్లు రాష్ట్రానికి చేరడంతో ఆ ప్రాంత నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వెంటనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చించి తిరిగి రాష్ట్రపతికి పంపించాలని కోరుతున్నారు. శుక్రవారం ఉదయం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు స్పీకర్ మనోహర్, సీఎం కిరణ్ లను వేర్వేరుగా కలిసి వెంటనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కోరారు.
No comments:
Post a Comment